మనిషి, మరణం, చరిత్ర

 మనిషి, మరణం, చరిత్ర

మనిషికి చావు, పుట్టుకల్లో చావు పెద్దది, గొప్పది, ఒక రహస్యం. సహజమైన చావు, పుట్టుకలు మనిషిని ఆలోచింపజేసినంత మరేవీ ప్రభావితం చేయలేదు.

పురాతన కాలం నుంచి...

          పాతరాతియుగంలో మనుషులు ఆహారసేకరణ కొరకు నిరంతరం సంచరిస్తూనేవుండేవారు. ఒక స్థిరనివాసమేదీ లేదు. కౄరమృగాలను వేటాడడమో, వాటి నోటికి ఆహారమైపోవడమో జరుగుతుండేది. చేతికి దొరికిన రాయి, రప్పా, కట్టె, పేడు, తీగె, ఊడలను ఆయుధాలుగా విసిరి, కొట్టి జంతువులను చంపి బువ్వ సంపాదించుకునేవారు. మెల్లగా రాతి కఠినత్వం తెలిసి, చేతిపనిముట్లుగా మలుచుకున్నారు. కొత్తరాతియుగంనాటికి మనుషుల ఆయుధసంపద పెరిగింది. ఆహార సేకరణకు వేట ప్రధానమైన సాధనమైంది. బతికినవాండ్లు బట్టకట్టనికాలంలో కొత్తతావులు వెతుక్కుంట పోయేవారు. చచ్చిన మనుషులను ఎక్కడికక్కడ వదిలేసేవారు. లేదా నీటిరేవుల్లో వదిలేసేవారు. అందువల్లనే కావచ్చు మనకు పాతరాతియుగంనాటి సమాధులు దొరకవు.

మరణం గురించి మనుషుల నిర్వేదన గురించి కూడా వేదంలో ప్రస్తావనలున్నాయి.

‘నీ చూపులు సూర్యునిలో, నీ శ్వాస గాలిలో కలిసిపోనీ

నీవు చేసినదాన్నిబట్టి (ధర్మం) భువికో, దివికో చేరుకో

కోరుకుంటే నీటిలో కలిసిపో నీ దేహంతో

చెట్లపొదలలో నివసించు’

(రుగ్వేదం, దశమమండలం- రుషి దమన యామాయన- 10-16 సూక్తాలు)

మరణాంతరం మనిషిశరీరాన్ని అగ్ని సంస్కారం చేయడం గురించి, లేదా నీటిలో వదిలేయడం గురించి ఈ సూక్తం చెప్తున్నది. మరణాంతర జీవనం మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నది. ఇది నాగరిక సమాజాలలో ఉండే సంస్కృతి. (చరిత్రకారులు రుగ్వేదంలో 10వ మండలం ప్రక్షిప్తమని చెప్పిన సందర్భాలున్నాయి.)

సమాధుల కథ:

సమాధుల నిర్మాణాలు కొత్తరాతియుగం చివరిదశనుంచి మొదలైనట్టు పురాతత్వవేత్తలు చెప్తున్నారు. సంచారంలో మనుషుల మధ్య కుటుంబజీవనం ఏర్పడలేదు సహజీవనం తప్ప. కడుపాకలికి వేట, సాహచర్యానికి స్త్రీ,పురుషుల సహవాసాలు అవసరమైనాయి. ఆయుధాలు మెరుగైన కొద్ది మనుషులు సంచారజీవనం నుంచి స్థిరజీవనం వైపుకు సాగారు. వ్యవసాయం తెలిసిన తర్వాత మనుషులు సంచారాన్ని క్రమంగా తగ్గిస్తూ నీటివనరులు, పరుపురాతిబండలున్న చిన్న గుట్టలు దాపుగా ఆవాసాలను ఏర్పరచుకుంటువచ్చారు. స్థిరజీవనంవల్ల మనుషుల మధ్య సహవాసకాలం పెరిగింది. సాహచర్య జీవనం పెరిగింది. అందువల్ల మనుషుల మధ్య అనుబంధాలు బలపడుతు వచ్చాయి. ఎవరైనా తమ మధ్యనుంచి మరణం వల్ల దూరమై పోతే, కనుమరుగైతే వారి జ్ఞాపకాలు దుఃఖానికి గురిచేయడంవల్ల ఉపశమనంగా, వారి కళేబరాలు జంతువుల పాలుకాకుండా దాచిపెట్టుకోవడానికి సమాధులొక దారిగా కనిపించాయి. కొన్నిచోట్ల వాతావరణ పరిస్థితుల కారణంగా మృతదేహాలను దహనం చేసి, ఎముకలను ఏరుకుని కుండల్లో దాచిపెట్టేవారు. అనువైన చోట సమాధులు నిర్మించి, వాటిలో పెట్టేవారు. సమాధులను నిర్మించే విధాన్ని బట్టి అవి 16రకాలుగా వుంటాయని పురావేత్తలు లెక్కించారు. మొదట్లో మరణించిన వారిని తాము నివసించేచోటనే సమాధి చేస్తుండేవారు. కాలం గడిచిన కొద్ది, తమ ఆవాసాలలో జనాభా పెరుగుతున్నకొద్ది సమాధులను నివాసాలకు అవతల నిర్మించేవారు.  వేదంలో కూడా ఈ సమాధుల ప్రస్తావన, శ్మశానస్థానం గురించి చర్చలున్నాయి. వేదకాలం కన్నా ఎంతో ముందరివి ఈ సమాధులు.

సమాధులు-మానవరూపారోపణలు:

          పురాతత్వవేత్తలు పురామానవుల సమాధుల తవ్వకాలలో లభించిన వస్త్వాధారాలను, సమాధుల నిర్మాణాలను పరిశీలించి, పరిశోధనాత్మక విశ్లేషణలు చేసారు. వాటి కాల నిర్ణయం కూడా చేసారు. మనకు లభిస్తున్న పురామానవ సమాధులు క్రీ.పూ. 2,500ల నుంచి క్రీ.శ. 500ల సం.రాల మధ్య నిర్మాణమైనవని లెక్కించారు. కాని, ఇప్పటికి కూడా మన దగ్గర ములుగు అడవుల్లో, చత్తీస్ ఘడ్ లో, జార్ఖండ్ లో, ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఈ పెదరాతియుగం(బృహచ్ఛిలాయుగం, మెగాలిథిక్ ఏజ్) సమాధులు నిర్మిస్తున్న ఆధారాలు, సమాచారాలున్నాయి.

నిర్మాణపరంగా ఈ సమాధులను పరిశీలించినపుడు కొన్ని సమాధులకు ప్రదక్షిణామార్గాలున్నాయి. సమాధిబండలను స్వస్తిక్ ఆకారంలో నిలిపే ఆచారాలను గమనించవచ్చు. కొన్నిచోట్ల సమాధుల మీది కప్పురాళ్ళు మానవరూపారోప ఫలకాలుగా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పడుగోని గూడెంలోని మెగాసమాధుల మీది మూతరాళ్ళ మీద స్త్రీ వక్షోజాలవంటి చెక్కి కనిపిస్తున్నది. చాలాచోట్ల శిలువ ఆకారపు మూతరాళ్ళున్నాయి. వాటికి క్రైస్తవానికి సంబంధంలేదు. ఎందుకంటే అవి క్రీస్తుపూర్వం 2వేల సం.రాల నాటివి కనుక. అట్లే కొన్ని పెట్టె(సిస్టు) సమాధులలో తలవైపు ఉండే రాతిసలపకు పెద్ద రంధ్రం(పోర్ట్ హోల్) చేయబడివుంటుంది. అందులోనుంచి మరణించిన మనిషి ప్రాణం తింటుందని ఆహారపదార్థాలు వేసే ఆచారముండేది. అంతేకాదు మనిషిప్రాణం పిట్టరూపంలో బయటతిరుగుతుంటుందని ఆ కంత అందుకేనని చెప్పేవారున్నారు. పెదరాతియుగం సమాధులున్నచోట చాలాచోట్ల స్మారకస్తంభాలు నిలిపి వుంటాయి. వీటిని కొందరు స్మశానం గుర్తులు కూడా అంటారు. కాని, ఈ చెక్కని రాతిస్తంభాలు కొన్నిచోట్ల రాతిస్తంభాలతోటలెక్క చాలా కనిపిస్తాయి. కొన్ని మానవరూపారోపణ(ఆంత్రోపోమార్ఫిక్) చేయబడిన స్తంభాలలెక్క వుంటాయి. వాటిని దేవుళ్ళని తెలంగాణాలో కర్నాటక రాష్ట్రాలలో పూజించేవారున్నారు.

మరణవేదన:

మనుషులకు మరణం, మరణాంతరం గురించి ఉన్న విశ్వాసాలు, భయాలు, మానవానుబంధాల అపేక్షలు పోయిన ప్రాణాలను ఆత్మలని, అవి తిరిగి రావాలి, వస్తాయనే ఆశాపూరిత కల్పనలే దేవతాభావనలకు మూలకాలైనాయి. మరణం నుంచి మనిషి తెచ్చుకున్నదే దివి. స్వర్గ, నరకాలు...దైవాలు...నేలకందనిచోట నెలవై వుంటాయని... చూసినట్లే చెప్పే కథలు మనల్ని నడిపిస్తున్నాయి.

Comments